సంగారెడ్డి ఎమ్మెల్యే
జగ్గారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టు ప్రారంభమైన
ఏడాదిలో సింగూరు, మంజీర, మహబూబ్ సాగర్ నీళ్లతో
నిండితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనంగా సన్మానం చేస్తానన్నారు. ఓ వైపు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ
ముఖ్యనేతలు విమర్శలు చేస్తుంటే.. బుధవారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలనే
తప్పుబట్టారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రారంభమై ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీరితే
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల పక్షాన నేను సన్మానం చేస్తాను. ప్రజలకు మంచి జరిగే
పనులు ఎవరు చేసినా సమర్థించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి
నేను మాట్లాడను. భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ,
మహారాష్ట్ర సీఎంలు వచ్చినా తప్పులేదు’ అని
జగ్గారెడ్డి అన్నారు.
అయితే జగ్గారెడ్డి
చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. కాళేశ్వరంలో అవినీతి
జరిగిందని తామంతా పోరాడుతుంటే.. సొంత పార్టీ నేతలే వారిపై ప్రశంసలు
కురిపించడమేంటని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ
నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్,
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.