బ్యాంకు అకౌంట్లో ఫుల్లుగా డబ్బులున్నా.. డ్రా చేయడానికిపోతే చుక్కలు చూపే ఏటీఎం సెంటర్లకు జరిమానా విధించేందుకు ఆర్‌బీఐ కొరడా బయటికి తీసింది. నగదు కోసం ఏటీఎం సెంటర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ఖాతాదారులకు ఇక నుంచి అలాంటి సమస్య ఎదురవకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. గంటలు, రోజుల తరబడి డబ్బుల్లేకుండా ఖాళీగా చాలా ఏటీఎం సెంటర్లు నో సర్వీస్ బోర్డులు పెడుతున్నారు. దీంతో ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన ఆర్‌బీఐ.. ఇప్పటి నుంచి ఏ ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన వెంటనే డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలుగా ఉండేలా చూసుకోనుంది.
మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండకూడదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, ప్రాంతాన్ని బట్టి జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో గంటల కొద్దీ ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల బయట వేచిచూస్తున్నారు. కొన్ని ఏటీఎంలలో అయితే నగదే ఉండకపోవడంతో ఖాతాదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏటీఎంలలో ఎంత నగదు ఉందని, ఆయా బ్యాంక్‌లకు సెన్సర్ల ద్వారా సమాచారం అందుతుంది. కానీ వాటిలో సకాలంలో నగదు నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆర్ బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో సదరు బ్యాంకులు ఏటీఎంలలో నిత్యం ఖాతాదారులకు నగదు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.